![]() |
![]() |
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన బాలీవుడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' చుట్టూ గత కొద్ది రోజులుగా ఒక ఆసక్తికరమైన వివాదం నడుస్తోంది. ఈ చిత్రం మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో.. దీని వెనుక రాజకీయ హస్తం ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఈ సినిమా స్క్రిప్ట్ ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచే రెడీ అయి వచ్చిందనే రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ క్రేజీ గాసిప్స్‌పై చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ తనదైన శైలిలో స్పందించారు. ఢిల్లీలో జరిగిన 'అమృత్ రత్న 2026' సదస్సులో పాల్గొన్న ఆయన, ఈ వార్తలపై నవ్వుతూనే గట్టి కౌంటర్ ఇచ్చారు. పీఎంవో నుంచి కథ వచ్చిందనడం కేవలం కొందరి కల్పితం మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు.
ఈ సందర్భంగా రాకేష్ బేడీ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నా కామెడీ టైమింగ్, డైలాగులు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. సినిమా సూపర్ హిట్ కాగానే ఇది పీఎంవో స్క్రిప్ట్ అని ప్రచారం చేస్తున్నారు. నేను వాళ్ళను ఒక్కటే అడుగుతున్నా.. అక్కడ కూర్చుని నేను చెప్పిన లాంటి నవ్వులు పూయించే డైలాగులు ఎవరైనా రాయగలరా? అసలు పీఎంవో అధికారులకు ఇలాంటి కామెడీ థాట్స్ వచ్చే ఛాన్స్ ఉందా?" అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
అంతేకాదు, ఈ స్పై యాక్షన్ డ్రామాలో కామెడీ ట్రాక్ పెట్టడానికి దర్శకుడు ఆదిత్య ధర్ మొదట్లో అస్సలు ఒప్పుకోలేదట. కథను రెండు, మూడు సార్లు క్షుణ్ణంగా చదివిన తర్వాతే.. ఇంత సీరియస్ సినిమాలో ఆడియన్స్ కాస్త రిలాక్స్ అవ్వడానికి హ్యూమర్ అవసరమని తానే దర్శకుడిని ఒప్పించినట్లు రాకేష్ బేడీ వెల్లడించారు. మొదట్లో సందేహించినా, సీన్లు బాగా పండటంతో డైరెక్టర్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారని చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో పాకిస్థాన్ రాజకీయ నాయకుడు 'జమీల్ జమాలీ'గా రాకేష్ బేడీ అద్భుత నటన కనబరిచారు. ముఖ్యంగా ఆయన చెప్పిన ‘బచ్చా హై తు మేరా’ అనే వన్-లైనర్ మీమ్స్ మెటీరియల్‌గా మారి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆదిత్య ధర్ అద్భుతమైన టేకింగ్‌తో వచ్చిన ఈ సినిమా పార్ట్ 1 గత ఏడాది డిసెంబర్‌లో, పార్ట్ 2 ఈ ఏడాది మార్చిలో రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఈ క్లారిటీతోనైనా ఈ క్రేజీ రూమర్లకు ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |